నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం
- మంటల్లో కాలిపోయిన 13 పశువులు
- పశువుల మరణం బాధాకరం
- బాధిత పాడి రైతుకు ప్రభుత్వం తరఫున అండగా నిలిచేలా చర్యలు
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా
పిఠాపురం, మేజర్ న్యూస్ :
పిఠాపురం మండలం నరసింగపురంలో అర్ధరాత్రి భార్య అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో కొత్తేం ధర్మారావుకు చెందిన పశువుల పాక పూర్తిగా అగ్నికు ఆహుతి అయింది. ఈ అగ్నిప్రమాదంలో పశువులు, కోళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను కాకినాడ జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు... పిఠాపురం పల్లపువీధికి చెందిన రైతు కొత్తెం ధర్మారావుకు చెందిన తాటాకుల పాకలో అగ్నిప్రమాదం సంభవించగా, 7 గేదెలు, 6 దూడలు, సుమారు 30 కోళ్లు మృతి చెందినట్లు కలెక్టర్ తెలిపారు. తాటాకుల పాకకు నిప్పు అంటుకోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు వివరించారు. ఈ అగ్నిప్రమాదంలో పాడి రైతు తన జీవనాధారాన్ని కోల్పోవడం బాధ కలిగించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే విచారణ జరిపి నివేదిక అందించాలని కలెక్టర్ కి స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున బాధిత పాడి రైతుకు అండగా నిలిచేలా, పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.