BREAKING
సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం

పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష

Select Suryaa Now
పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష

- మహిళా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి 

– అధికారులకు ఆదేశాలు

అన్నవరం, మేజర్ న్యూస్ :
కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్ర పరిధిలోని పంపా నదీ తీరంలో కార్తీక మాసం చివరి సోమవారం, పోలిస్వర్గం పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి (ఈవో) కె. లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పంపా నదీ తీరానికి చేరుకుని పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొని దీపాలు వెలిగించే అవకాశం ఉన్నందున, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పంపా నదీ తీరంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా భక్తులు దీపాలు వెలిగించుకునే ప్రాంతాల్లో తగిన స్థలాన్ని కేటాయించి, రద్దీ నియంత్రణకు అనుగుణంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. నదీ తీరంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భక్తులకు అవసరమైన సూచనలు అందించే విధంగా సూచిక బోర్డులు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు భక్తుల రాకపోకలు కొనసాగే అవకాశం ఉన్నందున పంపా నదీ పరిసర ప్రాంతాల్లో తగినంత విద్యుత్ వెలుగులు ఉండేలా లైటింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని ఎలక్ట్రికల్ విభాగం అధికారులకు సూచించారు. చీకటి ప్రాంతాలను గుర్తించి అదనపు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, క్యూ లైన్లు, బారికేడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఈవో లక్ష్మీ శివజ్యోతి, ఈఈ రామకృష్ణ సంబంధిత అధికారులతో ఏర్పాట్ల పురోగతిపై చర్చించి, భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. దేవస్థానంలోని వివిధ విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ఏర్పాట్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు.
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పంపా నదీ తీరానికి వచ్చే మహిళా భక్తులకు సురక్షితమైన వాతావరణం కల్పించడం, దీపారాధన కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించుకునేలా అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచడం ప్రధాన లక్ష్యంగా దేవస్థానం అధికారులు చర్యలు చేపడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఏర్పాట్లను పూర్తి చేయాలని ఈవో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్ష, క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో ఈఈ రామకృష్ణ, పర్యవేక్షణ అధికారి రమణ, సీసీ గణపతి, సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ రాంజీతో పాటు ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాలకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.