శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం
అన్నవరం, మేజర్ న్యూస్ : కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీమతి జి. సాయి లత, సాయి కిషోర్ దంపతులు రూ.2 లక్షలు విరాళంగా అందజేశారు.
ఈ మేరకు దంపతులు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి లక్ష్మీ శివజ్యోతిని కలిసి రూ.2,00,000 విరాళాన్ని అందజేశారు. ఈ విరాళంతో డిసెంబర్ 10వ తేదీన స్వామివారి సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఈవోను కోరారు.
అన్నదానం మహాదానంగా భావించి, స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందించాలనే సదుద్దేశంతో దంపతులు ఈ విరాళాన్ని అందించడం విశేషం. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి లక్ష్మీ శివజ్యోతి దాతలకు శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేసి అభినందించారు.
దేవస్థానంలో నిత్య అన్నదాన పథకం విజయవంతంగా కొనసాగేందుకు దాతలు అందిస్తున్న సహకారం ఎంతో దోహదపడుతోందని, భక్తుల సేవలో భాగస్వాములవుతున్న దాతల సేవాభావం అభినందనీయమని పేర్కొన్నారు.