భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి
- నాగలక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలి..
- ఎమ్మెల్యే అఖిలప్రియాను బాద్యురాలిగా ఎఫ్ఐఆర్ లో చేర్చాలి..
- లోకేష్ రెడ్ బుక్ తో రెచ్చిపోతున్న పసుపు గుండాలు..
కాకినాడ, మేజర్ న్యూస్ : నంద్యాల జిల్లా అహోబిలంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త నాగలక్ష్మి మృతి చెందడం తీవ్ర విషాదకరమని వైఎస్సార్‌సీపీ మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు.. అహోబిలంలో ఎన్నికల రిగ్గింగ్‌ను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని ఆరోపించారు.మహిళలపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. నిరసన తెలుపుతున్న మహిళలపైకి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కాన్వాయ్‌లోని వాహనం దూసుకెళ్లిన ఘటనలో నాగలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన నాగలక్ష్మి చివరకు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ మృతి చెందినప్పటికీ బాధ్యులపై తగిన చర్యలు తీసుకోకపోవడంపై పోలీసుల తీరును నాగమణి తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. నాగలక్ష్మి కుటుంబానికి తగిన న్యాయం, పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హింసకు బాధ్యులైన వారిని కాపాడే ప్రయత్నాలు మానుకోవాలని, నాగలక్ష్మి మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.. నారా లోకేష్ రెడ్ బుక్ అండ తో రాష్ట్రం లో పచ్చ గుండాలు రెచ్చి పోతున్నారని, అటువంటి వారికి సరైన రీతిలో బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు నాగమణి..