అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి
డీలిమిటేషన్ పేరుతో రిజర్వేషన్ మార్పు చేస్తే నల్లమలలో మరో ఉద్యమం తప్పదు
ఉప్పునుంతల, సూర్య న్యూస్:
రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియలో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని యథావిధిగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగానే కొనసాగించాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్, అంబేద్కర్ సంఘాలు, వివిధ దళిత కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అచ్చంపేట నియోజకవర్గానికి మరో 25 ఏళ్ల పాటు ఎస్సీ రిజర్వేషన్ కొనసాగించాలని కోరారు.
ఈ సందర్భంగా ఉప్పునుంతల మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బింపాకుల జంగయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులు ఇప్పుడిప్పుడే విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎదుగుతున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో డీలిమిటేషన్ పేరుతో అచ్చంపేట నియోజకవర్గ ఎస్సీ రిజర్వేషన్‌ను మార్చే అంశం దళితుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అచ్చంపేట నియోజకవర్గంలో 22.06 శాతం, సుమారు 50 వేల మంది దళిత ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.
దాదాపు 70 ఏళ్లుగా అచ్చంపేట ప్రాంతం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని, ఇప్పటివరకు ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాకపోవడం బాధాకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో దళితుల అభివృద్ధికి మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై పునరాలోచించి అచ్చంపేట నియోజకవర్గాన్ని మరో 25 ఏళ్ల పాటు ఎస్సీ రిజర్వుడు స్థానంగానే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.ఎస్సీ రిజర్వేషన్‌ను తొలగించి జనరల్ నియోజకవర్గంగా మారిస్తే నల్లమల ప్రాంతంలో లక్షలాది మందితో మరో ఉద్యమం చేపడతామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బింపాకుల జంగయ్య, మాజీ అధ్యక్షుడు బొల్లె బాలయ్య, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు బొల్లె మహేష్, అంబేద్కర్ సంఘాల నాయకులు చింతగళ్ల మల్లయ్య, పరశురాములు, వార్డు సభ్యుడు వేనయ్య, కుల సంఘాల నాయకులు అనిల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.