అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం
పరకాల, మేజర్ న్యూస్, పరకాల నుండి వయా అంబాల మీదుగా హనుమకొండకు నిత్యం అంబాల నుండి ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ రహదారి గుండా ప్రయాణం చేస్తుంటారు. గత నాలుగు నెలల నుండి నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టిన గుత్తేదారు డాంబర్ రోడ్డు వేయకపోవడం వల్ల ఈ రహదారి గుండా నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు, సామాన్య ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విపరీతంగా దుమ్ము ధూళి బస్సులోకి చేరి ప్రజల ముక్కు ద్వారా, నోటి ద్వారా లోపలికి వెళ్లి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రి కి వెళుతున్నట్లు వాపోతున్నారు. 14 కిలోమీటర్లు గల ఈ రోడ్డు దుమ్ము ధూళితో నిండి దుస్తులపై మరకలు ఏర్పడుతున్నాయని, ఈ రహదారి గుండా బస్సులు ఎక్కాలంటే ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
దుమ్ము ధూళి వల్ల రోజూ మూతికి, నెత్తికి కర్చీఫ్స్, స్కార్ఫ్స్, టోపీలు, మాస్కులు ధరించి ప్రయాణం చేస్తున్నామని, రోజూ కిలోల కొద్దీ దుమ్ముని మింగుతున్నామని వాపోతున్నారు. దుమ్ము ధూళితో బస్ సీట్ల మీద కూర్చోవాలంటేనే ఖంగు తింటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు శుభ్రంగా రెడీ అయ్యి వెళ్లిన టీచర్ల దుస్తులు మరకలతో నిండి అసహ్యంగా మారుతున్నాయని పేర్కొంటున్నారు. అలాగే బస్సుల టైర్లు పంక్చర్ అయి ట్రిప్పుల సంఖ్య తగ్గిస్తున్నారని, మిగతా వాహనాల టైర్లు, విడి భాగాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.ఈ రహదారి గుండా నిత్యం ప్రయాణించే ప్రయాణికులు కామిడి సతీష్ రెడ్డి, సూదం సాంబమూర్తి, మామిడి విజయసాగర్, మంతెన విజయ్ కుమార్, కొండ శ్రీనివాస్, లెక్కల ఇంద్రసేనారెడ్డి, సౌజన్య, అరవింద్, మధు, రేణుక తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రోడ్డును మరమ్మతులు చేసి దుమ్ము ధూళి బారి నుండి ప్రయాణికులకు విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రిపోర్టర్ :పురుషోత్తం, పరకాల, హనుమకొండ జిల్లా