మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు!
పరకాల, మేజర్ న్యూస్, పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులోని వెల్లంపల్లి రోడ్డు, లక్ష్మీనరసింహస్వామి రైస్ మిల్ ప్రాంతంలో గత మూడు నెలలుగా నల్లా నీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ తెలిపారు.శనివారం పరకాల మున్సిపాలిటీ కార్యాలయంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి, గోడ్లంగడి మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకు నుంచి తమ కాలనీకి సంబంధించిన పైపులైన్‌ను వెంటనే అనుసంధానం చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దామెర చెరువులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో భూగర్భ జలమట్టం పడిపోయి బోర్లలో సైతం నీరు సరిగా అందుబాటులో లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నల్లా నీరు రాక, మరోవైపు బోర్లలో నీరు లేక మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మున్సిపల్ అధికారులు ప్రజల తాగునీటి సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి, నూతన వాటర్ ట్యాంకు నుంచి 20వ వార్డులోని వెల్లంపల్లి రోడ్డు, లక్ష్మీనరసింహస్వామి రైస్ మిల్ ప్రాంతానికి పైపులైన్ అనుసంధానం చేసి శాశ్వత పరిష్కారం చూపాలని గాజుల నిరంజన్ డిమాండ్ చేశారు.కార్యక్రమంలో కాలనీవాసులు వేముల ఆంజనేయులు, దేవుళ్లపల్లి రవీందర్, ఆవాల వీరారెడ్డి, వీరస్వామి, చిన్ని తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్, పురుషోత్తం, పరకాల, హనుమకొండ జిల్లా