గ్రామాభివృద్ధి నా లక్ష్యం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకడియం మండలం మురమండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన నూతన సర్పంచ్ గారపాటి అన్నపూర్ణ శ్రీనివాస్ గ్రామాభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో విజయం కోసం కృషి చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మహిళా సోదరీమణులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికలు ముగియడంతో రాజకీయాలకు స్వస్తి పలికి గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలని, ఇకపై గ్రామంలో ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెళ్లలా కలిసి ఉంటూ మురమండ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహకారంతో పాటు గ్రామ కూటమి నాయకులు వట్టికూటి జానకిరామయ్య, ప్రత్తిపాటి రామారావు చౌదరి, దేవళ్ళ రామ్మోహన్ రావు తదితరుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.