మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క
ములుగు సూర్య ప్రతినిధి, మేజర్ న్యూస్, మినీ మేడారం జాతరకు తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని, ప్రస్తుత జాతర అవసరాలకే పరిమితం కాకుండా భవిష్యత్ జాతరలకు ఉపయోగపడేలా శాశ్వత మౌలిక వసతుల కల్పన, రహదారుల విస్తరణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.శనివారం ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర నిర్వహణ, అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 2027 ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న మినీ మేడారం జాతరకు భక్తుల అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గత మేడారం మహాజాతర సమయంలో తక్కువ వ్యవధిలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రాణనష్టం జరగకుండా జాతరను విజయవంతంగా నిర్వహించుకున్నామని తెలిపారు.గత జాతర సందర్భంగా వివిధ శాఖలకు మంజూరు చేసిన అభివృద్ధి పనుల్లో ఇప్పటివరకు పూర్తయిన పనులు, పురోగతిలో ఉన్న పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను శాఖల వారీగా సమీక్షించుకోవాలని అధికారులను ఆదేశించారు.గతంలో జారీ చేసిన మంజూరు ఉత్తర్వులను పరిశీలించడంతో పాటు ప్రధాన పూజారులు, ఇతర పూజారులతో చర్చించి ఇంకా అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించాలన్నారు. కొత్తగా ప్రతిపాదించే పనులు కేవలం మినీ జాతరకే కాకుండా రాబోయే జాతరలకు, ఏడాది పొడవునా వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఉపయోగపడే విధంగా దీర్ఘకాలిక దృష్టితో ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాబోయే రెండు నెలలపాటు మినీ మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మేడారంతో పాటు అనుబంధంగా జాతరలు జరిగే ప్రాంతాల్లోనూ భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాలని సూచించారు.
పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ, దేవాదాయ, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, పారిశుధ్య విభాగాల అధికారులు ఆయా ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి అవసరాలను గుర్తించాలన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో స్థానిక పూజారులు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు, సూచనల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
జాతర నిర్వహణకు అవసరమైన తాత్కాలిక ఏర్పాట్లు, దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే శాశ్వత నిర్మాణాలకు సంబంధించి వేర్వేరుగా ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. తాగునీరు, విద్యుత్ దీపాలు, రహదారులు, పారిశుధ్యం, ఆలయ పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
కన్నాయిగూడెం మండలం ఐలాపురంలో నిర్వహించే జాతరపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. అటవీ ప్రాంతంలో జరిగే ఈ జాతరకు వచ్చే భక్తులు మూడు రోజులపాటు అక్కడే బస చేసే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు.ఐలాపురం జాతర ప్రాంగణంలో శాశ్వత విద్యుత్ దీపాల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని, విద్యుత్ శాఖ అధికారులు రెండు, మూడు రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
మినీ జాతరగా భావించి భక్తుల రద్దీని తక్కువగా అంచనా వేయరాదని మంత్రి స్పష్టం చేశారు. గత మహాజాతర ముగిసినప్పటి నుంచి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని, మినీ జాతరకు కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
మేడారం సమగ్రాభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలిపారు. జాతర సమయంలో తరచూ ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా రింగ్ రోడ్డు తరహాలో రహదారుల విస్తరణ, శాశ్వత బస్టాండ్ నిర్మాణం, ప్రత్యామ్నాయ రవాణా మార్గాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. రహదారుల విస్తరణకు అవసరమైన అటవీ అనుమతులకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపినట్లు తెలిపారు.మంజూరైన వంతెనల నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని, ఏటా మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి లేకుండా శాశ్వత వంతెనలను నిర్మించాలన్నారు. రాబోయే మహాజాతర నాటికి భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు.ఏడాది పొడవునా మేడారానికి భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణానికి వెలుపల అనువైన ప్రదేశాల్లో శాశ్వత సులభ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. పూజారులు, స్థానిక సర్పంచ్, దేవాదాయ, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు సమన్వయంతో ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో మేడారంతో పాటు మల్లూరు దేవాలయానికి భక్తుల రాక పెరిగే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై ముందస్తుగా దృష్టి సారించాలన్నారు.అధికారులు తమ శాఖలకు సంబంధించిన పనులపై క్షేత్రస్థాయిలో పర్యటించి, గుర్తించిన సమస్యలు, అవసరాలు, అభివృద్ధికి సంబంధించిన సూచనలను అందించాలని మంత్రి కోరారు. మినీ మేడారం జాతరతో పాటు అనుబంధ జాతరల నిర్వహణకు అవసరమైన ప్రతిపాదనలను త్వరితగతిన సిద్ధం చేయాలన్నారు. రాబోయే మహాజాతర అవసరాలను కూడా ముందస్తుగా అంచనా వేసి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.గత జాతరలో చేపట్టిన పనులు, ప్రస్తుతం చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను శాఖల వారీగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పూజారుల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ భక్తుల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా జాతర ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి సూచించారు.జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ మినీ మేడారం జాతర ఏర్పాట్లపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతర ఏర్పాట్ల పర్యవేక్షణకు ఆయా శాఖల అధికారులు తమ శాఖల నుంచి ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. పూజారులు ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు సంబంధించిన అంచనాలను త్వరితగతిన రూపొందించి సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చే వారం నుంచి శాఖల వారీగా ప్రతిరోజూ పనుల పురోగతిని సమీక్షించనున్నట్లు తెలిపారు.అంతకుముందు మంత్రి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, ఎం. సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, స్థానిక సర్పంచ్, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్, శ్రీకాంత్, ములుగు, ములుగు జిల్లా