మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం
కొత్తగూడ, మేజర్ న్యూస్, వైద్యం వ్యాపారంగా మారుతున్న నేటి రోజుల్లో.. వైద్యసేవనే జీవిత ధ్యేయంగా భావించి, కనీస సౌకర్యాలు సైతం లేని రోజుల్లో మారుమూల ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అపూర్వమైన వైద్యసేవలు అందించిన ప్రజావైద్యుడు డా. వెంకటరత్నం సేవలు చిరస్మరణీయం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. మూడు దశాబ్దాలు గడిచినప్పటికీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారనడానికి ఆయన స్మారకార్థం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన స్పందనే నిదర్శనం…దివంగత డా. వెంకటరత్నం స్మారకార్థం శనివారం రోజున సూర్య స్వచ్ఛంద సంస్థ సహకారంతో
కొత్తగూడమండలంలోని
ఓటాయి గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది.తొలుత డా.వెంకటరత్నంచిత్రపటానికిపూలమాలలువేసిఘనంగానివాళులర్పించారు. అనంతరం ఆయన సతీమణి పాలడుగు రేణుకాదేవి శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెండ్యాలసారంగపాణి
మాట్లాడుతూ.. వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్న కాలంలోనే మారుమూల కొత్తగూడ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నిస్వార్థంగా, అంకితభావంతో వైద్యసేవలు అందించిన మహనీయుడు డా. వెంకటరత్నం అని కొనియాడారు. ఆయన మరణించి 30 ఏళ్లు గడిచినా నేటికీ ప్రజలు ఆయనను స్మరించుకుంటున్నారంటే, సమాజానికి ఆయన అందించిన సేవల విలువ ఎంత గొప్పదో అర్థమవుతుందన్నారు. పదవులు, పేరు ప్రతిష్టల కంటే ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చిన ఆయన సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కుటుంబ సభ్యులు కొనసాగిస్తూ ప్రజలకు వైద్యసేవలు అందించడం అభినందనీయమన్నారు.
కాగా, ఈ శిబిరంలో సుమారు 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా,వారిలో 50 మందికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించారు.వీరందరికీ సోమవారంమహబూబాబాద్‌లోని సూర్య కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు సంస్థ నిర్వాహకులు మాధవరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ధనుసరి జ్యోతి, రేణ్య తండా సర్పంచ్ మాలోత్ లక్ష్మీ రావోజీ, వార్డు సభ్యులు ఎరుకల రాజకుమార్, తగిడి సరిత, చింత సరిత, గ్రామ పెద్దలు జండా రామారావు, బుగ్గల కొమురయ్య, చింత అనిల్ తదితరులు పాల్గొన్నారు...
రిపోర్టర్ ;వెంకన్న, కొత్తగూడ, మహబూబాద్ జిల్లా