మోదీపై వ్యక్తిగత విమర్శలు సరికాదుః ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీసీ సంఘాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో 13 బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విమర్శలు విధానాలు, పాలన, అభివృద్ధి అంశాలకే పరిమితం కావాలని, వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదని హితవు పలికారు. మోదీపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమంపై చర్చించాల్సిన కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని బీసీ సంఘాల నాయకులు విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ భేదాభిప్రాయాలు సహజమని, అయితే వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. దేశాభివృద్ధి, పేదరిక నిర్మూలన, ప్రజల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బీసీ నేతలు పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన నాయకత్వంలో చేపడుతున్న కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, నాయకులపై విమర్శలు చేసేటప్పుడు సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాజకీయ విమర్శల పేరుతో ప్రధానమంత్రి వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం సరికాదని 13 బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఖర్గే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సామాజిక న్యాయంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ ప్రకటనపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు సి. రాజేందర్, బీసీ విద్యార్థి సంఘం ఫెడరేషన్ అధ్యక్షుడు పల్లగొండ్ల మోడీ రాందేవ్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు సుధాగోని నరేష్, బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ శివకృష్ణ ముదిరాజ్, బీసీ ప్రజా సమితి అధ్యక్షుడు ఎత్తిరి భీమరాజ్, బీసీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు అల్లం యాదయ్య తదితరులు పేర్కొన్నారు.
ఎ.రవీందర్ తెలంగాణ బ్యూరో ప్రతినిధి