అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. --ఆందోళనలో రైతాంగం --విద్యుత్తు, తాగునీటికి ఇబ్బందులు -12 గంటలు విద్యుత్ కు అంతరాయం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: అర్నబ్ తుఫాన్ కారణంగా మండలంలో భారీ వర్షాలు, వాయు వేగం గా గాలులు వీచాయి. మంగళవారం రాత్రి గం 3ల నుంచి బుధవారం సాయంత్రం గం4ల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో కొన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా నిలిచి పోవడంతో ప్రజలు తాగునీటికి, విద్యుత్ సమస్యలు ఎదుర్కొన్నారు. తుఫాన్ తీరం దాటేంత వరకు భయాందోళన చెందారు. ఈ ఏడాది ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని ఖరీఫ్ లో సాగు చేసిన వరి పైర్లు ప్రస్తుతం సుంకు పోసుకుని లేత దశలో ఉండటం తో రైతాంగం తీవ్ర నిరాశకు గురైయ్యారు. తుఫాన్ ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉంది అని వస్తున్న సమాచారంతో మరింతగా ఆందోళన చెందుతున్నారు. బుధవారం ఉదయం నుంచి దాదాపు అన్ని గ్రామాల ప్రజలు తమ నివాసాలకే పరిమితమ య్యారు. తుఫాన్ ఏమేరకు నష్టం చేకూరుస్తుందోనని ప్రతీ ఒక్కరూ దిగాలు చెందుతున్నారు.
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల చెట్లు విరిగి నేలకొరిగాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపల్లె -భట్టిప్రోలు -తెనాలి మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్ద అయ్యాయి. కాగా వర్షం కారణంగా దెబ్బ తిన్న వరి పైరులను ఎమ్మెల్యే నక్కా ఆనందాబాబు బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన ప్రతీ రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా కల్పించారు.