వరిని ముంచేసిన అర్నబ్ తుఫాన్
పూసపాటిరేగ, సూర్య : అర్నబ్ వరి రైతులకు గుండె కోతనే మిగిల్చింది. వేలాది ఎకరాల్లో వేసిన వరి పంట లు తుఫాన్ దాటికి పూర్తిగా ఒరిగిపోవడంతో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పంట చేతి కందకుండా పోయిందంటూ రైతులు రోదిస్తున్నారు. అర్నాబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో,వెంపడం, తాళ్ళపేట గ్రామాల్లో వరి మిగతా పంటల పరిస్థితులను మండల వ్యవసాయ అధికారిని నీలిమ సిబ్బందితో కలిసి బుధవారం పరిశీలించారు. పొలాల్లో అధికంగా నిలిచిన నీటిని బయటకు పంపేలా మురుగు కాలువలను శుభ్రం చేయాలి వరద నీరు పొలంలోకి ప్రవేశించకుండా చూడాలి. పంట పడిపోయినట్లయితే నీరు త్వరగా తొలగేలా చర్యలు తీసుకోవాలి, వర్షాల సమయంలో యూరియా మరియు ఇతర ఎరువుల పై పూతను వాయిదా వేయాలి. పొట్ట దశలో వున్న వరి పొలంలో పాము పొడ తెగులు వచ్చే అవకాశం ఉంది కావున ప్రొపికోనోజోల్ 1 ఎంఎల్/లీటర్ లేదా హెక్సాకోనజోల్ 2 ఎం ఎల్/లీ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు.
నీరు తగ్గిన తరువాత పంటను పరిశీలించి తెగుళ్లు లేదా పురుగు లక్షణాలు కనిపించినప్పుడు గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా మండల వ్యవసాయ అధికారి గారి సలహాల తో చర్యలు తీసుకోవాలని *మండల వ్యవసాయ అధికారి నీలిమ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి భాను, మరియు రైతులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.