రాపూరు బీజేపీలో అసమ్మతి సెగ.. మండల నాయకుల పార్టీ పదవులకు రాజీనామా
రాపూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా రాపూరు స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాపూరు మండల భారతీయ జనతా పార్టీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ తరఫున నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, పార్టీ అధిష్టానం నుంచి బీఫాంలు అందకపోవడంతో మండల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన తమకు తగిన గుర్తింపు లభించడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకంతో పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామని, ఎంత కష్టపడి పనిచేసినా తమకు విలువ లేకుండా పోయిందని వాపోయారు. ఈ క్రమంలో రాపూరు మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి మనుబోలు శివప్రసాద్, పార్టీ ఉపాధ్యక్షుడు కరిపం బాలసుబ్రమణ్యం, పార్టీ కార్యదర్శి ఇండ్ల రాజశేఖర్ తమ పదవులకు రాజీనామా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఈ పరిణామం రాపూరు మండల బీజేపీలో చర్చనీయాంశంగా మారింది.