శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.. ఉమ్మడి నల్లగొండ రైతులకు నీటి భరోసా కల్పించాలి!
10.51 లక్షల వ్యవసాయ హోల్డింగ్స్.. 25.02 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి.. సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం తగదు: డా. చినుకని శివ ప్రసాద్
: ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శివన్నగూడెం రిజర్వాయర్ పనులను ప్రభుత్వం వేగవంతం చేసి, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డా. చినుకని శివ ప్రసాద్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ గణన 2021–22 ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10,51,242 వ్యవసాయ హోల్డింగ్స్, సుమారు 25.02 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలిపారు. ఇంతటి వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న ప్రాంతంలో సాగునీటి వనరులను బలోపేతం చేయడం అత్యంత అవసరమన్నారు.
డిండి ఎత్తిపోతల పథకం కింద సుమారు 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం ఉండగా, 2024 ఆగస్టు నాటి ఇరిగేషన్ శాఖ నివేదిక ప్రకారం అప్పటివరకు 12 వేల ఎకరాలకే సాగునీటి సామర్థ్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ గణాంకాలపై ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితిని స్పష్టం చేయాలని కోరారు.
శివన్నగూడెం ప్రాజెక్టు పనుల పురోగతి, మిగిలిన వ్యయం, భూసేకరణ, నీటి పంపిణీ వ్యవస్థల పూర్తి వివరాలతో తాజా నివేదికను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ద్వారా లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాలకు సాగునీరు అందించడంతో పాటు, అవసరమైన గ్రామాలకు సురక్షిత తాగునీరు అందేలా కార్యాచరణ ప్రకటించాలని కోరారు.
రైతులకు హామీలు కాదు.. పొలాలకు నీరు కావాలి! ప్రాజెక్టు పనుల్లో జాప్యాన్ని నివారించి, నల్లగొండ రైతులకు సాగునీటి భరోసా కల్పించాలి అని డా. చినుకని శివ ప్రసాద్ స్పష్టం చేశారు.