అప్పుల ఊబిలో రైతులు ఆదుకునే వారేలేరా..
తలకొండపల్లి మండలంలో వున్న 32 గ్రామ పంచాయతీలకు కరువు సాయం అందించాలి..
తలకొండపల్లి, రంగారెడ్డి :
మండల పరిధిలోని 32గ్రామ పంచాయతీల రైతుల గోస తెలుసుకొని తలకొండపల్లి మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని, కరువు మండలాల జాబితాలో తలకొండపల్లి మండలానికి చోటు కల్పించకపోవడం, తలకొండపల్లి మండల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూన్నారని తలకొండపల్లి బిఆర్ఎస్ నాయకులు గాతరెడ్డి విజయ్ కుమారరెడ్డి అన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి, పంటలు ఎండిపోయి, పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితుల్లో తలకొండపల్లి మండలాన్ని కరువు మండలాల జాబితా నుంచి ఎలా మినహాయిస్తారని గౌతరెడ్డి విజయకుమార్ రెడ్డి ప్రశ్నించారు. తలకొండపల్లి మండలం ఏమైనా ధనిక మండలమా, ఇక్కడి రైతులంతా లక్షాధికారులా రైతుల పొలాల్లో పంటలు ఎండిపోతుంటే, బోర్లలో నీళ్లు అడుగంటిపోతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా మండలంలో నదీ జలాలు, సాగునీటి కాలువలు, పెద్ద చెరువుల ద్వారా నిరంతర సాగునీటి సౌకర్యం ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు పంట నష్టాలు, మరోవైపు పెరిగిన నిత్యావసర ధరలు, అప్పుల భారం రైతు కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. పంటలు పండక రైతు కన్నీరు పెడుతుంటే, కరువు జాబితాలో పేరు లేకపోవడం రైతులకు మరో అన్యాయం కాదా రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం వారి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండలంలోని క్షేత్రస్థాయి పరిస్థితులను తక్షణమే పరిశీలించి, పంట నష్టం, భూగర్భ జలాల పరిస్థితి, రైతుల ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని తలకొండపల్లి మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి. అర్హులైన రైతులకు కరువు సహాయం అందించి, రుణమాఫీ సమస్యలను పరిష్కరించి, రైతుల కన్నీళ్లకు విలువ లేదా, రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం అని రైతుల పక్షాన పోరాడుతాం అని బిఆర్ఎస్ నాయకులు గౌతరెడ్డి విజయకుమార్ రెడ్డి పేర్కొన్నారు.
- చప్పిడి తిరుపతి, మేజర్ న్యూస్.