మాల్తుమ్మెద చెన్నకేశ్వర ఆలయం గుట్టపై చిరుత పులి సంచారం కలకలం.
సూర్య, నాగిరెడ్డి పేట్,;;;నాగిరెడ్డి పేట మండలంలో పలు గ్రామాల్లో చిరుత పులి సంచరిస్తుండడం కలకలం సృష్టిస్తుంది. గత ఐదు రోజుల క్రితం మండలంలోని వెంకంపల్లి గ్రామ శివారులో చిరుత పులి సంచరించడం గ్రామస్తులకు భయాందోళన కలిగించగా. తాజాగా బుధవారం సాయంత్రం మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలోని చెన్నకేశ్వర ఆలయం గుట్టపై చిరుతపులి సంచరిస్తుండడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మాల్తుమ్మెద గేటు సమీపంలో మంగళవారం రాత్రి చిరుతపులి గుట్టపై నుంచి రోడ్డు దాటుతుండగా కొందరు స్థానికులకు చిరుత కంటపడింది. దీంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో స్థానిక డిప్యూటీ రేంజ్ అధికారి రాఘవేంద్రరావు తమ సిబ్బందితో వెళ్లి చిరుత సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించారు. తిరిగి బుధవారం సాయంత్రం గ్రామ శివారులోని చెన్నకేశ్వర స్వామి గుట్ట వద్ద చిరుత సంచరిస్తుండడం గ్రామస్తుల కంటపడింది. గ్రామస్తులు చెన్నకేశ్వర స్వామి గుట్ట ప్రాంతానికి వెళ్లి చిరుత పులిని చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.దీంతో డిప్యూటీ రేంజ్ అధికారి రాఘవేంద్ర రావు సంఘటన స్థలానికి వెళ్లి చిరుతను చూసి గ్రామ శివారులో చిరుత సంచరిస్తుండడం వాస్తవమేనని ఆయన నిర్ధారించారు. గత రెండు రోజులుగా గ్రామ శివారులో చిరుత సంచరిస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ శివారులో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని రాత్రివేళ ఎవరు ఒంటరిగా గ్రామ శివారులోకి, పంట పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లొద్దని అటవీశాఖ రేంజ్ అధికారి వాసుదేవ్ గ్రామస్తులను కోరారు.