telangana
రైతులను రారాజులుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సూర్య వేములవాడ రూరల్ ;;వేములవాడ రూరల్ మండల పరిధిలోని చెక్కపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగిల్ విండో) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండలంలోనే మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలనే ఉన్నత లక్ష్యంతో 2006లోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని గుర్తుచేశారు. ఆనాటి నుండి నేటివరకు ఐకేపీ, ప్యాక్స్, మార్కెట్ కమిటీలు, డీసీఎంఎస్ సంస్థల ద్వారా నిరంతరం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తూ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందన్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మరింత ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు మద్దతు ధరతో పాటు సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ. 500 అదనపు బోనస్ అందిస్తోందని తెలిపారు. తెలంగాణ నేల స్వభావానికి అనుగుణంగా 7 రకాల సన్న వంగడాలను సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తే, బోనస్ ఎగ్గొట్టడానికే షరతులు విధించారంటూ ప్రతిపక్ష నేత హరీష్ రావు రాజకీయ విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వ సూచనల ఫలితంగా బహిరంగ మార్కెట్లో మంచి ధర లభించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతానికి పైగా రైతులు సన్న రకాలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించారని వివరించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకముందే వ్యాపారులు నేరుగా పొలాల వద్దకే వచ్చి మద్దతు ధర, బోనస్ కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి నేడు రైతులకు నెలకొందని చెప్పారు.
రైతులను చైతన్యపరిచేందుకు ప్రభుత్వం ఊరుకోకుండా రైతు వేదికల వద్ద విత్తన మేళాలు నిర్వహించడమే కాకుండా, వ్యవసాయ శాఖ అధికారుల భాగస్వామ్యంతో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా మార్గదర్శనం చేసిందని తెలిపారు. బోనస్ రూపంలో లభిస్తున్న ఆర్థిక లబ్ధితో రైతులు తమ పిల్లల చదువులకు, కుటుంబ అవసరాలకు సంతోషంగా ఖర్చు చేసుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో రూ. 76 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రూ. 2 లక్షల వరకు ఉన్న రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తూ రాష్ట్రంలోని 25 లక్షల రైతు కుటుంబాలకు రూ. 20,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని వేల కోట్లు రైతులకు ఇవ్వలేదని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకువచ్చే రైతులు నిబంధనల ప్రకారం 17 శాతం వరకు మాత్రమే తేమ ఉండేలా చూసుకొని ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించి లబ్ధి పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బహిరంగ మార్కెట్లో మంచి ధర ఉంటే రైతులు స్వేచ్ఛగా అక్కడ విక్రయించుకోవచ్చని, వ్యాపారులు మద్దతు ధర తగ్గించి మోసం చేయకుండా భరోసా ఇవ్వడానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను నడుపుతోందని వివరించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులను రారాజులుగా చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అధికారుల దృష్టికి లేదా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఫ్యాక్స్ చైర్మన్ వకుళభరణం శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.