ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తుల పంపిణీ అభినందనీయం: పీఏసీఎస్ చైర్మన్ మన్నె శంకర్ యాదవ్
మోమిన్‌పేట, మేజర్ న్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమని మేకవనంపల్లి పీఏసీఎస్ చైర్మన్ మన్నె శంకర్ యాదవ్ అన్నారు. బుధవారం మేకవనంపల్లి గ్రామంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రీన్ మెట్రో సంస్థ ఆధ్వర్యంలో 278 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. గ్రీన్ మెట్రో అధినేత బొడ్డు అశోక్ విద్యార్థులకు దుస్తులను అందజేశారు.ఈ సందర్భంగా మన్నె శంకర్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభివృద్ధికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుతోందని, విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుశీల, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గౌరీశంకర్, గ్రీన్ మెట్రో అధినేత బొడ్డు అశోక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.