తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ పర్యటన
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతుఫాను నేపథ్యంలో ప్రజల భద్రతను పర్యవేక్షించేందుకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, చాగల్లు తదితర ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.తుఫాను ప్రభావంతో చెట్లు కూలిపడటం, రహదారులకు అంతరాయం కలగడం, ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పోలీసులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. రెవెన్యూ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని, పాలు, పండ్లు, కూరగాయలు, బియ్యం, పప్పులు తదితర నిత్యావసర సరుకులను ముందుగానే సమకూర్చుకుని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రజలు రోడ్లపై తిరగవద్దని, వ్యాపారులు తమ దుకాణాలను రాత్రి 8 గంటలలోపు మూసివేయాలని కోరారు.