ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ
మిర్యాలగూడ అర్బన్,మేజర్ న్యూస్:
ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించి, పోలీస్‌శాఖపై మరింత నమ్మకాన్ని పెంచే ఉద్దేశంతో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ జి. రవి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డలో బుధవారం అర్ధరాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనిఖీ వివరాలను డీఎస్పీ వెల్లడించారు.
కాలనీలో పలు బృందాలుగా విడిపోయి తెల్లవారుజామున వరకు సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. తనిఖీల్లో 106 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలు, ఒక కారుతో మొత్తం 127 వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. తమకు నచ్చిన వాహనాల వివరాలపై సమగ్ర విచారణ జరిపి తిరిగి అప్పగిస్తామని తెలిపారు.
అదేవిధంగా కాలనీలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లయితే డయల్ 100కు లేదా స్థానిక పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఇండ్లు అద్దెకు ఇచ్చే సమయంలో కిరాయిదారుల పూర్తి వివరాలు తీసుకోవాలని భవన యజమానులకు సూచించారు. నేరాల నియంత్రణ, పాత నేరస్తులను గుర్తించడమే ప్రధాన లక్ష్యంగా కాలనీలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యంపై పోలీసులకు పలుసూచనలు చేశారు.
తనిఖీల్లో ఏడుగురు సీఐలు, 10 స్పెషల్ పార్టీ పోలీస్ బృందాలు, 12 మంది ఎస్‌ఐలు, 21 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 66 మంది ఏపీసీలు, 13 మంది మహిళా కానిస్టేబుళ్లతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.