*గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి*
*చేవెళ్ల డిక్లరేషన్ హామీల సాధనకు ‘గిరిజన గళం–తండాలో నిద్ర’ యాత్ర*
*సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ రవీందర్ నాయక్ డిమాండ్*
*చివ్వేంల, మేజర్ న్యూస్.*
కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సేవాలాల్ సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ధరావత్ రవీందర్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్, కౌన్సిలర్ జ్యోతి లింగా నాయక్ ఆధ్వర్యంలో గిరిజన గళం తండాలో నిద్ర కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రవీందర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడీలకు మంత్రి పదవి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు డీమ్డ్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించాలని, మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరారు. లంబాడీల గోర్ బోలి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని, రాష్ట్ర రాజధానిలో సేవాలాల్ మహారాజ్ మందిరంతో పాటు గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
గిరిజనుల హక్కుల సాధన కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గిరిజన సాధు సంతులకు ధూపదీప నైవేద్యంతో పాటు గౌరవ వేతనం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య నాగు నాయక్, సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు తరుణ్ నాయక్, జిల్లా నాయకులు రాజశేఖర్ నాయక్, హరీష్ నాయక్, వెంకన్న నాయక్, మనోజ్ నాయక్, సేవ్యా నాయక్, రాజా నాయక్ తదితరులు పాల్గొన్నారు.