ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... 54వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి బోయళ్ళ శాంతి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్ ను మరింత అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి బోయళ్ళ శాంతి తెలిపారు. నగర పలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 54వ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కూటమి నాయకులతో కలిసి ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. డివిజన్‌లోని కాలనీలు, వీధుల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శాంతి మాట్లాడుతూ ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపిస్తే 54వ డివిజన్‌ను అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు అంకితభావంతో పనిచేస్తానన్నారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటి సరఫరా, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, మెరుగైన పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, నాణ్యమైన అంతర్గత రహదారులు, ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. డివిజన్ పరిధిలో పచ్చదనం పెంపు, పార్కుల అభివృద్ధి, పిల్లలకు ఆట స్థలాల ఏర్పాటు, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు, సుధాకర్ రావు, మధుసూదన్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులు, మహిళలు, యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్