అంగవైకల్యాన్ని అధిగమించి జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన సాయినాథ్ రెడ్డికి ఘన సన్మానం.. రూ.50 వేల నగదు ప్రోత్సాహకం
మేడ్చల్, మేజర్ న్యూస్: అంగవైకల్యాన్ని అధిగమించి, కృషి పట్టుదలతో క్రికెట్‌లో రాణించి భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ఎంపికైన కిష్టాపూర్‌కు చెందిన సాయినాథ్ రెడ్డి యువతకు ఆదర్శంగా నిలిచాడని మేడ్చల్‌కు చెందిన రామన్నగారి రాఘవేందర్ గౌడ్ అన్నారు. జాతీయ స్థాయికి ఎదిగిన సాయినాథ్ రెడ్డిని ఆయన ఘనంగా సన్మానించి రూ.50 వేల నగదు బహుమతిని అందజేశారు.కిష్టాపూర్‌కు చెందిన వేముల రవీందర్ రెడ్డి, లతా దంపతుల కుమారుడైన సాయినాథ్ రెడ్డి చిన్నప్పటి నుంచి ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ క్రికెట్‌పై ఆసక్తి, అంకితభావంతో ముందుకు సాగాడు. కోచ్ ప్రశాంత్ రెడ్డి మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, నిరంతర సాధనతో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా రామన్నగారి రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ అంగవైకల్యం విజయానికి అడ్డంకి కాదని సాయినాథ్ తన ప్రతిభ, పట్టుదలతో నిరూపించాడన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని వదలకుండా శ్రమిస్తే విజయం సాధించవచ్చని, యువత సాయినాథ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.తన విజయానికి తల్లిదండ్రులు వేముల రవీందర్ రెడ్డి, లతా అందించిన ప్రోత్సాహం, కోచ్ ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన శిక్షణ, మార్గదర్శకత్వమే ప్రధాన కారణమని సాయినాథ్ రెడ్డి తెలిపారు. తనను ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.సాయినాథ్ రెడ్డిని ప్రోత్సహిస్తూ పలువురు దాతలు నగదు బహుమతులు అందించారు. రామన్నగారి రాఘవేందర్ గౌడ్ రూ.50 వేలు, పబ్బటి సాయిగౌడ్ (డీటీడీసీ శ్రీభారతి కమ్యూనికేషన్) రూ.35 వేలు, డాక్టర్ రవి ఉత్తర రూ.20 వేలు, రాకేష్ పాల్ (గుడ్డు) రూ.10 వేలు అందజేశారు. మహిళల అండర్-19 క్రికెట్ జట్టు ప్రాబబుల్స్‌కు ఎంపికైన బీలి శ్రీజకు కూడా రూ.10 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు.సాయినాథ్ రెడ్డి భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ఎంపిక కావడంపై కిష్టాపూర్ గ్రామస్థులు, మేడ్చల్ పట్టణవాసులు హర్షం వ్యక్తం చేశారు. అతని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన రామన్నగారి రాఘవేందర్ గౌడ్‌తో పాటు ఆర్థిక సహాయం అందించిన దాతలకు అభినందనలు తెలిపారు. సాయినాథ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, తన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.