తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
మునుగోడు,మేజర్ న్యూస్:మండలంలోని కొంపెల్లి గ్రామానికి చెందిన బోయపర్తి మహేందర్ (39) వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురై,హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన మహేందర్‌కు నలుగురు ఆడపిల్లలు సంతానం ఉన్నారు. కుటుంబాన్ని పోషిస్తూ బిడ్డల భవిష్యత్తుకు అండగా నిలిచిన ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.బుధవారం నిర్వహించిన అంత్యక్రియల్లో పెద్ద కూతురు సాక్షి తండ్రికి తలకొరివి పెట్టింది. తండ్రిని కోల్పోయిన ఆడబిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. కుటుంబాన్ని ఆదుకోవాల్సిన వ్యక్తి మృతి చెందడంతో నలుగురు చిన్నారుల బాధ్యత భార్య రోజాపై పడింది.
*బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత*
మహేందర్ మృతి విషయం తెలుసుకున్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం పంపించారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మండుల సత్యం మహేందర్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు.
*బాధిత కుటుంబానికి ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వీరమల్ల సురేష్‌గౌడ్ రూ.10 వేల ఆర్థిక సహాయం*
కొంపెల్లి గ్రామానికి చెందిన ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వీరమల్ల సురేష్‌గౌడ్ బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు.కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయిన రోజా, ఆమె నలుగురు ఆడబిడ్డలకు భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు దాతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
కె. ఇంద్రసేనా రెడ్డి,మేజర్ న్యూస్, మునుగోడు,నల్గొండ జిల్లా.