అమరవీరుల త్యాగాలకు కొవ్వొత్తులతో నివాళి
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
దేశ భద్రత, సమాజ రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రకాశం జిల్లా పోలీసులు బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి కర్నూలు రోడ్ కూడలిలోని పోలీసు అమరవీరుల స్థూపం వరకు ఈ ర్యాలీ సాగింది. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్.యుగంధర్ బాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ జి.నాగేశ్వరరావుతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది కొవ్వొత్తులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ఎన్.యుగంధర్ బాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల ధైర్యం, త్యాగం, సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. వారి త్యాగస్ఫూర్తి భవిష్యత్ తరాలకు దేశభక్తి, కర్తవ్యనిబద్ధతకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజ భద్రత, దేశ ఐకమత్యాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని, పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి సామాజిక ఐక్యతకు కట్టుబడి ఉంటుందని తెలిపారు.
అనంతరం అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు పోరాడిన అమరవీరుల త్యాగాలకు “ఇవే మా జోహార్లు” అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో ఎఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఆర్ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.