కీసరలో అక్రమ మట్టి తవ్వకాలపై విజిలెన్స్ మెరుపు దాడులు.. ఎక్స్కవేటర్, మూడు టిప్పర్లు సీజ్
కీసర, మేజర్ న్యూస్ : గనుల శాఖ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ గ్రావెల్, మట్టి తవ్వకాలపై అధికారులు చర్యలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ అధికారులు, స్థానిక పోలీసులు, గనుల శాఖ అధికారులు బుధవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండల పరిధిలో సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు.కీసర మండలంలోని సర్వే నంబర్లు 200/2, 138లో ఎలాంటి మైనింగ్ అనుమతులు లేకుండానే భారీ యంత్రాలతో గ్రావెల్, మట్టిని తవ్వుతున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. సింగారం నారాయణ ఆధ్వర్యంలో అక్రమ తవ్వకాలు, రవాణా సాగుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు.అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న టీఎస్ 08 యూఏ 8586, టీజీ 08 టీ 0981, టీఎస్ 08 యూఈ 7277 రిజిస్ట్రేషన్ నంబర్లు గల మూడు టిప్పర్లతో పాటు క్యాట్ 323D3 మోడల్ హిటాచీ-220 ఎక్స్కవేటర్ను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలపై సింగారం నారాయణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.