అసంపూర్తిగా చెర్లగూడ వంతెన!
గుంతల మయంగా చెర్లగూడ రోడ్డు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు..
సమస్యలపై ఎమ్మెల్యే యాదయ్యను నిలదీసిన సర్పంచ్ పెంటయ్య
డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వీధి దీపాలు కరువు
ఏళ్లుగా అసంపూర్తిగానే బ్రిడ్జి.. పనుల జాప్యంపై డీఈని ఆరా తీసిన ఎమ్మెల్యే
షాబాద్ మేజర్ న్యూస్ (అక్టోబర్ 28) : షాబాద్ మండల పరిధిలోని చెర్లగూడ గ్రామానికి చెందిన వంతెన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిందని ఏళ్లు గడిచిన పూర్తి కావట్లేదని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించు కోవడంలేదు అని గ్రామ సర్పంచ్ పెంటయ్య, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసారు. మా గ్రామానికి నిధులు ఎక్కడ? అభివృద్ధి పనులు ఎప్పుడు?” అంటూ చెర్లగూడ సర్పంచ్ పెంటయ్య ఎమ్మెల్యే కాలే యాదయ్యను నిలదీశారు. గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చెర్లగూడ గ్రామం చేవెళ్ల నియోజకవర్గంలో లేదా? అంటూ ప్రశ్నించారు. గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, సీసీ రోడ్లు నిర్మించకపోవడం, వీధి దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయకపోతే ప్రజలకు కనీస వసతులు ఎలా కల్పించాలని ప్రశ్నించారు. గ్రామ సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు.
ఏళ్లుగా పూర్తికాని వంతెన నిర్మాణం
గ్రామంలో నిర్మాణంలో ఉన్న వంతెన నిర్మాణం పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంపై సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా పూర్తికావాల్సిన పనులు ఇంకా అసంపూర్తిగా ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, పనుల్లో జాప్యానికి గల కారణాలను పరిశీలించి బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
బ్రిడ్జి పనులపై ఎమ్మెల్యే ఆరా...
మరోవైపు, బ్రిడ్జి నిర్మాణ పనుల జాప్యంపై ఎమ్మెల్యే కాలే యాదయ్య స్పందించారు. సంబంధిత డీఈకి ఫోన్ చేసి నిర్మాణ పనుల పురోగతి, జాప్యానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా? నిర్మాణ పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయి? అనే అంశాలపై ఆరా తీశారు. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలని డీఈని కోరారు. గ్రామంలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంతో పాటు అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెర్లగూడ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారా అనే ప్రశ్నలు గ్రామంలో వ్యక్తమవుతున్నాయి.
నాలుగేళ్లుగా రోడ్డు పనులు పెండింగ్…ఎమ్మెల్యేను ప్రశ్నించిన సర్పంచ్ పెంటయ్య
షాబాద్ మండల పరిధిలోని చెర్లగూడ వంతెన నిర్మాణం పనులు మంజూరై నాలుగేళ్లు గడిచినా పూర్తి కాలేదని సర్పంచ్ పెంటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఎమ్మెల్యే కాలే యాదయ్య ను కలిసి గ్రామ సమస్యలను వివరించారు. అధ్వానంగా ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, మంజూరైన హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతిపత్రం అందజేశారు.