telangana
ఆరు నెలల క్రితమే వివాహం.. వివాహిత ఆత్మహత్య
బంట్వారం, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం సల్బత్తాపూర్ గ్రామంలో వివాహిత నందిని (22) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితమే వివాహమైన యువతి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన నందిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. ఇంటి తలుపులు చాలాసేపటి వరకు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆమె ఉరివేసుకుని కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న దారూర్ సీఐ రఘురామ్, బంట్వారం ఎస్సై పుండ్లిక్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.నందినికి ఆరు నెలల క్రితమే అదే గ్రామానికి చెందిన బసప్పతో వివాహమైనట్లు తెలిసింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన అనంతరం కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.