వారం రోజుల్లో సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి : అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి
బకాయిదారులైన రైస్ మిల్లర్లకు తుది అవకాశం.. గడువులోగా చెల్లించకపోతే చర్యలు
(రంగారెడ్డి - మేజర్ న్యూస్) : జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల వసూలుపై అధికారులు దృష్టి సారించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వారం రోజుల్లోగా పూర్తిగా చెల్లించాలని బకాయిదారులైన రైస్ మిల్లర్లకు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. చంద్రారెడ్డి తుది అవకాశం కల్పించారు. నిర్ణీత గడువులోగా బకాయిలు చెల్లించని మిల్లర్లపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బకాయిదారులైన రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించి, సీఎంఆర్ బకాయిల వసూలు ప్రక్రియపై సమీక్షించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న బకాయిల వివరాలను పరిశీలించడంతో పాటు, మిల్లర్ల వారీగా చెల్లించాల్సిన మొత్తాలు, చెల్లింపుల్లో జాప్యానికి గల కారణాలపై చర్చించారు. బకాయిల వసూలును ప్రాధాన్యతగా తీసుకొని, పెండింగ్ మొత్తాలను త్వరితగతిన రాబట్టేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) 2014-15 నుంచి ఖరీఫ్ 2024-25 వరకు ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 17 ప్రకారం రైస్ మిల్లర్ల నుంచి బకాయిలను వసూలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బకాయిల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
సమావేశం జరిగిన తేదీ నుంచి వారం రోజుల్లోగా బకాయిలను పూర్తిగా చెల్లించాలని రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిర్ణీత గడువును మిల్లర్లు సద్వినియోగం చేసుకొని ఎలాంటి జాప్యం లేకుండా బకాయిల చెల్లింపులు పూర్తి చేయాలని సూచించారు. బకాయిల వసూలు విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.