జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా కోహీర్ జర్నలిస్టులకు ఘన సన్మానం
కోహీర్, ; జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని కోహీర్ పట్టణంలో జర్నలిస్టుల సేవలను గుర్తిస్తూ ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోహీర్ మున్సిపల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ ముజఫర్ హుస్సేన్ కోహీర్ మండలంలోని జర్నలిస్టులను శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ముజఫర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం నాలుగో స్తంభంగా ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. సమాజంలో జరిగే సంఘటనలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు తీరు, మౌలిక వసతుల కొరత వంటి అనేక అంశాలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రజల గొంతుకగా జర్నలిస్టులు నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులు వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీతో కూడిన వార్తలను అందిస్తూ సమాజ హితం కోసం పనిచేయడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టుల కలం మరింత బలంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ క్షేత్రస్థాయిలో వాస్తవాలను వెలికితీసే వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. జర్నలిస్టులను గౌరవించడం, వారి సేవలను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సన్మానం అందుకున్న కోహీర్ మండల జర్నలిస్టులు ముజఫర్ హుస్సేన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా తమను గుర్తించి గౌరవించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎం. అశోక్, వైస్ చైర్మన్ అబ్దుల్ హన్నాన్ జావేద్, మాజీ వైస్ చైర్మన్ షాకీర్ అలీ, కోహీర్ మండల మజ్లిస్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, దిగ్వాల్ సర్పంచ్ అహ్మద్ అలీ, యూసుఫ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.