అర్హులైన పేదలకు అభివృద్ధి ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్
కోహిర్ ; కోహిర్ మండల కాంగ్రెస్ ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి డా. ఏ. చంద్రశేఖర్ అన్నారు. కోహిర్ మండలంలోని రైతు వేదికలో, కోహిర్ మున్సిపల్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమాల్లో కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ గత పాలకులు పేదల సంక్షేమాన్ని విస్మరించారని, పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరులో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై క్వింటాలుకు రూ.500 బోనస్, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. అర్హులైన నిరుపేదలకు చేయూత పింఛన్లు మంజూరు చేసి వారి జీవనానికి భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సువర్ణ మల్లన్న పాటిల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముజాఫర్ హుస్సేన్, మాజీ పట్టణ అధ్యక్షుడు షంషీర్ అలీ, మున్సిపల్ వైస్ చైర్మన్ హన్నన్ జావీద్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్, కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.