12వ పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమగ్రంగా రూపొందించాలి
విజయవాడ, మేజర్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆకాంక్షలకు అనుగుణంగా 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికను త్వరితగతిన, సమగ్రంగా రూపొందించాలని ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ కోరారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో 12వ పీఆర్సీ చైర్మన్ దినేష్ కుమార్‌ను ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలను వివరించారు. ప్రభుత్వ శాఖల వద్ద అందుబాటులో ఉన్న ఉద్యోగుల వేతనాలు, సర్వీసు వివరాలు, భత్యాలు, ఇతర ఆర్థిక అంశాల డిజిటల్ డేటాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించి నివేదిక తయారీని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గత పీఆర్సీ సమయంలో భత్యాలు, సర్వీసు అంశాలకు సంబంధించి ఉత్తర్వుల జారీలో ఎదురైన సమస్యలు, జాప్యాలు పునరావృతం కాకుండా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. గత మూడేళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొన్న కాలపరమైన, ఆర్థిక నష్టాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా, నిర్ణీత గడువులో నివేదిక రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, ప్రధాన కార్యదర్శి బసవలింగం, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జానీ పాషా, కార్యదర్శి అంకమ్మ రాజు, ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జి. నారాయణరావు, విష్ణువర్ధన్ రావు, ట్రెజరీ అసోసియేషన్ అధ్యక్షుడు పాము శ్రీనివాసరావు, కార్యదర్శి రమణ రెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.