ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏపీ ఎన్జీవో సంఘం లక్ష్యం
విజయవాడ, మేజర్ న్యూస్: ఉద్యోగుల హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు, సంక్షేమం కోసం ఏపీ ఎన్జీవో సంఘం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీజేఏసీ చైర్మన్ ఎ. విద్యాసాగర్ తెలిపారు. మంగళవారం విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముంచిరాజు అక్కిరాజును, కార్యవర్గ సభ్యులను విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ అభినందించారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, డీఏలు, హెల్త్ కార్డుల అమలుకు ప్రభుత్వంతో నిరంతరం చర్చిస్తున్నామని విద్యాసాగర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉద్యోగులు గత 30 ఏళ్లుగా సంఘానికి అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం, 11 వేల మంది సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ల సాధనకు కృషి చేస్తున్న విద్యాసాగర్‌ను ఉద్యోగ సంఘం ప్రతినిధులు అభినందించారు. కార్యక్రమంలో రాజ్యలక్ష్మి, సి.ఎం. దాస్, డి. సత్యనారాయణ రెడ్డి, రమేష్, సి.వి.ఆర్. ప్రసాద్, జి. నారాయణరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.