ఘన వ్యర్థాల నిర్వహణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు
విజయవాడ, మేజర్ న్యూస్: ఎన్టీఆర్ జిల్లాలో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు2026ను పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో 20 మంది అధికారులతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి కలెక్టర్ ఛైర్‌పర్సన్‌గా, జాయింట్ కలెక్టర్ వైస్ ఛైర్‌పర్సన్‌గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాలను శుద్ధి చేయడం, బల్క్ వేస్ట్ జనరేటర్ల నిర్వహణను తనిఖీ చేయడం, అక్రమంగా చెత్త పారవేయడం, తగలబెట్టడాన్ని అరికట్టడం వంటి చర్యలను ఈ సెల్ పర్యవేక్షిస్తుంది. పాత డంపింగ్ యార్డుల్లో బయోమైనింగ్ పనులను వేగవంతం చేయడంతో పాటు, అనుమతిలేని వాహనాల ద్వారా చెత్త రవాణాను నిరోధించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు, వాహనాల సీజ్, సంస్థల మూసివేతకు సిఫార్సులు, అవసరమైతే నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేతతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక సెల్ నెలకు ఒకసారి సమావేశమై అమలు తీరును సమీక్షిస్తుందని, ప్రభుత్వానికి పక్షం రోజులకు ఒకసారి, నెలవారీ నివేదికలు సమర్పిస్తుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రత కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు కూడా పారిశుద్ధ్య నిర్వహణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.