కోఆప్షన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలను నిబంధనల మేరకు నిర్వహించాలి
మచిలీపట్నం, మేజర్ న్యూస్: ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న కోఆప్షన్ సభ్యుల ఎంపిక, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఎంపీడీవోలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై సూచనలు చేశారు. కోఆప్షన్ సభ్యుల ఎంపికలో అర్హులైన మైనారిటీ అభ్యర్థులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలను నిర్ణీత సమయాల్లో పూర్తి చేయాలని తెలిపారు. సమావేశానికి కనీసం 50 శాతం కోరం తప్పనిసరని, ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు ఉంటే చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయించి, ఫలితాలు, నిర్ణయాలను మినిట్ బుక్‌లో నమోదు చేయాలన్నారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి ఫారంఏ, ఫారంబి, రాజకీయ పార్టీల విప్ పత్రాలను నిబంధనల ప్రకారం సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో సభ్యులు సకాలంలో హాజరయ్యేలా ముందస్తు సమన్వయం చేసుకోవాలని సూచించారు. వర్షాలు, తుపాను పరిస్థితుల దృష్ట్యా కోరం సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలకు ముందు వరుసలో, ఎంపీటీసీ సభ్యులకు పార్టీల వారీగా సీటింగ్ ఏర్పాటు చేయాలని, ఓటు హక్కు ఎంపీటీసీ సభ్యులకే ఉంటుందని స్పష్టం చేశారు. ఎలాంటి పొరపాట్లకు, వివాదాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈవో ఎం. శ్రీహరి పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.