హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు
విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్: ప్రజారోగ్య పరిరక్షణకు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, చికెన్, మటన్ షాపులు, కబేళాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్‌చార్జ్ కమిషనర్ ఏ. రవీంద్రరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రధాన కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, పరిశుభ్రత, తాగునీటి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. కలుషిత ఆహారం, నీటి సరఫరా గుర్తిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకోవాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లలో నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలని, 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లలో కూరలు విక్రయించకుండా చూడాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సి.హెచ్. నిర్మల గౌరీ, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్, ప్రభుదాస్, షమ్మీ, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, డాక్టర్ గోపాల నాయక్, డాక్టర్ డి. హరీష్, శానిటరీ సూపర్వైజర్లు సలీం, బాలాజీ, శ్రీధర్, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.