అక్వాన్ తుఫాను నేపథ్యంలో డ్రైనేజీల పూడికతీత ముమ్మరం
మచిలీపట్నం, మేజర్ న్యూస్: అక్వాన్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మచిలీపట్నం నగరంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీల పూడికతీత పనులను ముమ్మరం చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రత్యేకంగా సూపర్ సక్కర్ యంత్రాన్ని తెప్పించి ప్రధాన డ్రైనేజీలు, కల్వర్టుల వద్ద పూడిక తొలగింపు పనులు చేపట్టారు. రెండు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్న మట్టి, వ్యర్థాలను తొలగించనున్నారు. ఈ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసినా నీరు వేగంగా బయటకు వెళ్లేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. పబ్లిక్ హెల్త్ అధికారి ప్రవీణ్ పనుల పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. సంబంధిత శాఖల సమన్వయంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.