అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
మచిలీపట్నం, మేజర్ న్యూస్: అక్వాన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు విద్యుత్ సంబంధిత సేవలను అందించేందుకు ఏపీసీపీడీసీఎల్ కృష్ణా సర్కిల్ పరిధిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున విద్యుత్ సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సమస్యలు, ప్రమాదాల సమాచారాన్ని అందించేందుకు కృష్ణా సర్కిల్ కంట్రోల్ రూమ్ నంబర్ 6281709355, ఉయ్యూరు డివిజన్ 7382623231, మచిలీపట్నం డివిజన్ 9440817572, గుడివాడ డివిజన్ 9440817573 నంబర్లను అందుబాటులో ఉంచారు. తుఫాన్ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని సీఎండీ సూచించారు. విద్యుత్ ప్రమాదాలు సంభవించే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు, ప్రమాదాలు లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1912 లేదా సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం అందించాలని పి. పుల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.