నవంబర్ 22న పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు
మచిలీపట్నం, మేజర్ న్యూస్: గుడివాడ, తాడిగడప మున్సిపాలిటీల్లో నవంబర్ 26న నిర్వహించనున్న ఎన్నికల పోలింగ్ విధులకు నియమితులైన అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ నెల 22న పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ తెలిపారు. ఈ కేంద్రాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని వెల్లడించారు. గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో అడుసుమల్లి గోపాలకృష్ణయ్య మున్సిపల్ హైస్కూల్‌లో, తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల సెల్‌లో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 26న ఎన్నికల విధులకు అధికారికంగా నియమితులై, సంబంధిత మున్సిపల్ ఓటరు జాబితాలో పేరు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి అర్హులని స్పష్టం చేశారు. అర్హులు ఫారంXA, ఎన్నికల విధుల నియామక ఉత్తర్వులు, ఓటరు గుర్తింపు కార్డు లేదా సూచించిన ఇతర గుర్తింపు పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. ఓటరు జాబితాలోని పేరు, వార్డు నంబరు, పార్ట్ నంబరు, సీరియల్ నంబరు వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు. కేంద్రాల వద్ద తాగునీరు, కూర్చునే సదుపాయం, విద్యుత్, వెలుతురు వంటి మౌలిక వసతులు కల్పించడంతో పాటు అవసరమైన అధికారులను నియమించి పారదర్శకంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియపై మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అసిస్టెంట్ ఏఎంఓ ఆర్. శ్యామ్ సుందర్ రావును 9515311229 నంబరులో సంప్రదించాలని తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.