స్థానిక ఎన్నికల్లోనూ 94 శాతం స్ట్రైక్‌రేట్.. కూటమి విజయ పరంపర కొనసాగిస్తాం!
పెనమలూరు, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారని, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన 94 శాతం స్ట్రైక్‌రేట్‌ను రానున్న ఎన్నికల్లోనూ పునరావృతం చేస్తామని కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ధీమా వ్యక్తం చేశారు. పెనమలూరులోని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ రాజకీయ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. గొడ్డలి పార్టీ వైఖరి, ఆ పార్టీ అధినేత అభిప్రాయాలు ఎప్పటికీ మారవని, రౌడీయిజం, గూండాగిరే వారి ప్రధాన రాజకీయమని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం రాజధాని లేని పరిస్థితిని ఎదుర్కొందని మంత్రి విమర్శించారు. అమరావతిపై జగన్ పదేపదే తన వైఖరిని మార్చుకుంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. మావిగన్ ప్రతిపాదనను వైసీపీ కార్యకర్తలే తిరస్కరిస్తున్నారని, ప్రజలు అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సొంత పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని మంత్రి తెలిపారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో మేయర్ పీఠాలను కూటమి కైవసం చేసుకుందని గుర్తుచేశారు. ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, రానున్న రెండున్నరేళ్లలో అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల విషయంలో మరింత వేగంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య విభేదాలు వస్తాయని వైసీపీ ఆశించినప్పటికీ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడంతో పాటు పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి పుష్కరాల కంటే ముందే అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం పనులు ముందుకు సాగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను వేగవంతం చేసిందని పేర్కొన్నారు. ఇటీవల తుఫాను సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని, ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. గంటల వ్యవధిలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి ప్రజలకు భరోసా కల్పించామన్నారు. విపత్తుల సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందిస్తోందని వివరించారు. జగన్ మరోసారి పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తానని భావిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. మరోవైపు నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు, బెదిరింపులకు పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షం సహకరించాలని హితవు పలికారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతం చేయడం ద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.