డయల్ 112కు కాల్.. ప్రకాశం బ్యారేజ్ వద్ద తల్లీబిడ్డలకు ప్రాణరక్షణ
విజయవాడ క్రైం, మేజర్ న్యూస్: కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురై రెండేళ్ల చిన్నారితో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సకాలంలో స్పందించి రక్షించారు. ప్రకాశం బ్యారేజ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన మహిళ తన రెండేళ్ల పాపతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నట్లు ఈ రోజు ఉదయం డయల్ 112కు సమాచారం అందింది. పోలీస్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న హెచ్‌సీ 1524 సుబ్బారావు ద్వారా సమాచారం అందుకున్న కంట్రోల్ రూం ఇన్‌స్పెక్టర్ ఎం.వి. దుర్గారావు వెంటనే అప్రమత్తమయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని సీసీ కెమెరాల ద్వారా మహిళ తన పాపతో కలిసి ప్రకాశం బ్యారేజ్ సమీపంలో ఉన్నట్లు గుర్తించి వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ గుణారామ్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన వెంటనే పీసీ 2792 గురువులు, హెచ్‌జీ 177 అబ్దుల్ జలీల్‌ను ఘటనా స్థలానికి పంపించారు. పోలీసులు వేగంగా అక్కడికి చేరుకుని మహిళను, చిన్నారిని సురక్షితంగా రక్షించారు. అనంతరం మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి, సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ఇబ్బందులు ఎదురైతే పోలీసులను ఆశ్రయించాలని అవగాహన కల్పించారు. అనంతరం మహిళను కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. ఈ ఘటనలో తక్షణమే స్పందించి తల్లీబిడ్డలను రక్షించడంలో కీలక పాత్ర పోషించిన కంట్రోల్ రూం ఇన్‌స్పెక్టర్ ఎం.వి. దుర్గారావు, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ గుణారామ్, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల భద్రత, శ్రేయస్సే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.