గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
మచిలీపట్నం, మేజర్ న్యూస్: కృష్ణా జిల్లాలో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు–2026లో పోలింగ్ విధులకు నియమితులైన అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మూడు విడతల్లో 26 మండలాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటు హక్కును కోల్పోకుండా ఈ ప్రత్యేక సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో ఆరు మండలాలకు సంబంధించి నవంబర్ 24న బాపులపాడు, గన్నవరం, గుడ్లవల్లేరు, నందివాడ, ఉంగుటూరు, గుడివాడ మండలాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రెండో విడతలో ఎనిమిది మండలాలకు సంబంధించి నవంబర్ 27న పెదపారుపూడి, కంకిపాడు, మొవ్వ, పెనమలూరు, పామర్రు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఉయ్యూరు మండలాల్లో కేంద్రాలు నిర్వహించనున్నారు. మూడో విడతలో 12 మండలాలకు సంబంధించి నవంబర్ 30న అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, ఘంటసాల, గూడూరు, కోడూరు, కృత్తివెన్ను, మోపిదేవి, మచిలీపట్నం నార్త్, మచిలీపట్నం సౌత్, నాగాయలంక, పెడన మండలాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా మండలాల్లో నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో వరుసగా పోలింగ్ జరగనుంది. సంబంధిత విడతలో ఎన్నికల విధులకు అధికారికంగా నియమితులై, సంబంధిత గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో పేరు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ సదుపాయానికి అర్హులని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హులు ఫారంXIV, ఓటరు గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రం, ఎన్నికల విధుల నియామక ఉత్తర్వులతో ఫెసిలిటేషన్ కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు. ఓటరు జాబితాలోని తమ పేరు, ఇతర వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. కేంద్రాల్లో పత్రాలు, అర్హతలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని, అర్హులైన ఉద్యోగులందరికీ సమాచారం అందించి ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9515311229 హెల్ప్‌లైన్ నంబరును సంప్రదించాలని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.