ఎలాంటి లోపాలకు తావులేకుండా తుది ఓటరు జాబితా రూపొందించాలి
సంగారెడ్డి, ప్రతినిధి :- ఎలాంటి తప్పులు, లోపాలకు తావులేకుండా పారదర్శకంగా తుది ఓటరు జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించాలని సూచించారు.మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరం నుండి ఈఆర్వోలు, ఏ ఈ ఆర్ఓలతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియపురోగతి, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏఎస్‌డిడి (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ , డూప్లికేట్ )ఓటర్లకు
ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించినందున క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి,ఎన్యూమరేషన్
ఫారాలు సమర్పించిన వారి దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను ఈ నెల 21వ తేదీలోగా పూర్తి చేయాలని, పరిశీలనలో అర్హులుగా తేలిన వారిని ఓటరు జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.పెండింగ్‌లో ఉన్న ఓటర్లకు సంబంధించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులా? అనర్హులా? అనే అంశాన్ని స్పష్టంగా నిర్ధారించి తుది నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.అనర్హులుగా గుర్తించిన ఓటర్లకు సంబంధించి ప్రతి కేసుకు పూర్తి ఆధారాలు, సంబంధిత పత్రాలతో ప్రత్యేక ఫైళ్లను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. భవిష్యత్తులో అవసరమైనప్పుడు పరిశీలించేందుకు వీలుగా ప్రతి అభ్యర్థికి సంబంధించిన రికార్డులు పక్కాగా ఉండాలని తెలిపారు.ఫోటో మ్యాపింగ్ ప్రక్రియలో ఎలాంటి పెండెన్సీ లేకుండా పూర్తి చేయాలని, అదేవిధంగా ఫారం-6, 7, 8 దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు.ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ సంగీత, ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ ఓ లు,ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.