నవజాత శిశు సంరక్షణ వారోత్సవాలకు శ్రీకారం
తొలి 28 రోజుల సంరక్షణ ఎంతో కీలకం
డీఎంహెచ్‌వో డాక్టర్ ఇ.ఎన్.వి. నరేష్ కుమార్
శ్రీకాకుళం, నవంబర్ 16 మేజర్ న్యూస్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు నవజాత శిశు ఆరోగ్య పరిరక్షణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఇ.ఎన్.వి. నరేష్ కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఈ వారోత్సవాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది ఈ వారం రోజుల పాటు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో క్షేత్రస్థాయిలో తల్లులకు అవగాహన కల్పించాలన్నారు.
నవజాత శిశువు సంపూర్ణ ఆరోగ్యానికి పుట్టిన తొలి 28 రోజుల సంరక్షణ అత్యంత కీలకమని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. ముఖ్యంగా తక్కువ బరువుతో, నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సేవలు అందించడంతో పాటు గృహ సందర్శనల ద్వారా వారి ఎదుగుదలను పర్యవేక్షించాలన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు పూర్తి వెచ్చదనం కల్పించడం, ముర్రిపాలు తాగించడం, కంగారు మదర్ కేర్, నిర్ణీత సమయంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించడంపై తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. బొడ్డుతాడును ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచాలని, దానిపై ఎలాంటి పూతలు పూయకూడదని స్పష్టం చేశారు. శిశువు పాలు తాగకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీర ఉష్ణోగ్రతలో మార్పులు వంటి ప్రమాద సంకేతాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించాలని, శిశు సంరక్షణ కుటుంబ సభ్యులందరి సమిష్టి బాధ్యత అని ఆయన వివరించారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్ రామ్స్, డీఎస్‌వో డాక్టర్ పి. సుజాత, ఆర్‌బీఎస్‌కే వైద్యులు డాక్టర్ శివరంజిని, డాక్టర్ వెంకటరావు, హెచ్‌ఈఈవో ముఖలింగం, డిప్యూటీ హెచ్‌ఈవో పి. మోహిని రత్నకుమారి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.