వైసీపీని వీడి టీడీపీలో చేరిన 30 కుటుంబాలు
ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో పార్టీలోకి ఆహ్వానం
మెలియాపుట్టి. నవంబర్ 16. మేజర్ న్యూస్...
మెలియాపుట్టి మండలంలోని పరుశురాంపురం గ్రామ పంచాయతీ పరిధి హీరాపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సుమారు 30 కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ ఎంపీపీ సవర వజ్రమ్మ ఆశీస్సులు, సూచనలతో మంగళవారం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
గ్రామానికి చెందిన గంధం జయచంద్రుడు, కిల్లి రుషి, లక్ష్మీపురం వెంకటరావు, లక్ష్మీపురం కొండయ్య, లక్ష్మీపురం నారాయణరావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని తెలిపారు.
టీడీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు వెల్లడించారు. పార్టీ అభివృద్ధితో పాటు గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు సలాన మోహనరావు, మండల టీడీపీ అధ్యక్షుడు నంబాల వెంకటరావు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.