ఉపాధ్యాయుడు సామన్న దొర హత్య కేసులో నిందితులందరినీ అరెస్టు చేయాలి
- నెల్లిమర్లలో మృతుని భార్య రమణమ్మ ధర్నా
నెల్లిమర్ల, సూర్య: కుమరాపు సామన్న దొర హత్యలో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితులందరినీ తక్షణమే అరెస్టు చేయాలని మృతుని భార్య రమణమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె నెల్లిమర్ల తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ శ్రీకాంత్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రమణమ్మ మాట్లాడుతూ.. తన భర్త సామన్న దొర హత్య వెనుక ఉరిటి రామచంద్రరావు, వారి ఇద్దరు కుమారులు, ఒక స్థానిక నాయకుడు ఉన్నారని, అందరూ కలిసి ప్రణాళికాబద్ధంగా ఈ హత్య చేశారని పోలీసులకు స్పష్టమైన ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే పోలీసులు కేవలం రామచంద్రరావును మాత్రమే అరెస్టు చేశారని, మిగిలిన నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె తహశీల్దార్‌ను కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో టొంపల నరసయ్య (జై భీమ్ రావు భారత పార్టీ జిల్లా అధ్యక్షులు) బంగార్రాజు (దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ) ఎం.పి రాజు (డిబిఎస్ యు) జిల్లా ప్రధాన కార్యదర్శి) నరసింహ దొర (గిరిజన సంఘ నాయకుడు) దీసారి మురళి (ఎస్టీ సంఘం నెల్లిమర్ల అధ్యక్షులు) వరలక్ష్మి (మహిళా సంఘ నాయకురాలు) వీరితో పాటు పలువురు దళిత సంఘాల నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులందరికీ చట్టపరంగా కఠిన శిక్ష పడేవరకు తమ పోరాటం ఆపేది లేదని నాయకులు స్పష్టం చేశారు.