కట్టంగూరు మండలంలోనీ ప్రజావాణికి నో రెస్పాన్స్..ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి!
ఫిర్యాదులు లేక వెలవెలబోతున్న ప్రజావాణి.. ప్రజల్లో అవగాహన లేదా?
సమస్యలు లేవా..? అధికారులపై నమ్మకం లేదా..? ప్రచారం లోపించిందా..? కారణాలపై చర్చ-
ప్రజా సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి కట్టంగూర్ మండలంలో ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదనే చర్చ సాగుతోంది. ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణికి ప్రజల నుంచి ఫిర్యాదులు తక్కువగా రావడం, కొన్ని సందర్భాల్లో ఫిర్యాదుదారులు లేక కార్యక్రమం వెలవెలబోతుండటం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ప్రజలకు సమస్యలు లేవా? లేక ప్రజావాణి కార్యక్రమంపై అవగాహన లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ముందుకు రావడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజావాణి ఎప్పుడు నిర్వహిస్తారు? ఎక్కడ ఫిర్యాదు చేయాలి? ఎవరికి దరఖాస్తు అందించాలి? ఫిర్యాదు చేసిన తర్వాత పరిష్కారం ఎలా తెలుసుకోవాలి? అనే విషయాలపై చాలామందికి సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం అవుతుందా? అధికారుల నుంచి స్పందన ఉంటుందా? అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయా? అన్నది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించడం మాత్రమే కాకుండా గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలి. గ్రామ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు సమాచారం అందించాలి.
ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును స్వీకరించి సంబంధిత శాఖలకు పంపడంతో పాటు పరిష్కార స్థితిని ఫిర్యాదుదారులకు తెలియజేయాలి. మండల అధికారులు కూడా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి.
ప్రజావాణి లక్ష్యం నెరవేరాలంటే ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనం ఉండాలి. ప్రజలకు సమస్యలు లేవా? లేక ప్రజావాణిపై నమ్మకం తగ్గిందా? ప్రచార లోపమా? అనే అంశాలపై అధికారులు ఆత్మపరిశీలన చేసుకొని ప్రజావాణికి పూర్వ వైభవం తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.