సిద్దిపేటపై కాంగ్రెస్ సర్కార్ వివక్ష నిలిచిపోయిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి
సిద్దిపేట అర్బన్, : సిద్దిపేట జిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. గత ప్రభుత్వం మంజూరు చేసి ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపివేయడం, నిధులను రద్దు చేయడం ద్వారా జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేట పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ప్రజల పక్షాన పలు డిమాండ్లతో బహిరంగ లేఖ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో అసత్య ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని అప్పట్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, కేంద్ర జల సంఘం లేఖల ద్వారా స్పష్టం చేశాయని తెలిపారు. నీళ్లు లేని ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించి ప్రజాధనం వృథా చేయకుండా, నీటి లభ్యత ఉన్న ప్రాంతానికి ప్రాజెక్టును మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని రద్దు చేసి పారదర్శకంగా పనులు చేపట్టామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌పై బురదజల్లడం మానుకొని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా కొత్తగా ఒక్క ప్రాజెక్టును నిర్మించలేదని, ఒక్క ఎకరాకు అదనపు ఆయకట్టు నీరు అందించలేదని విమర్శించారు. కాళేశ్వరం, దేవాదుల, సీతారామ, సమ్మక్క బ్యారేజీ, పాలమూరు ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తే కరువును సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉండేదన్నారు. కృష్ణా జలాల వినియోగం, పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
రుణమాఫీ హామీ ఏమైంది?
2024 మే 2న సిద్దిపేట పర్యటన సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని హరీశ్‌రావు గుర్తుచేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో 20,514 మందికి మాత్రమే రుణమాఫీ కాగా, 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి అప్పులు చేసి బ్యాంకుల్లో రుణాలు చెల్లించిన రైతులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసి సిద్దిపేటకు రావాలని, అలా చేస్తే తానే స్వయంగా బొకే ఇచ్చి స్వాగతం పలుకుతానని వ్యాఖ్యానించారు.
2026 మార్చి 22న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి 45 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, 230 రోజులు గడిచినా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. యాసంగి రైతుబంధు, అకాల వర్షాలు, వడగళ్ల వానలతో నష్టపోయిన రైతులకు పరిహారం విషయంలోనూ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
రూ.1,070 కోట్ల పనులు నిలిపివేత
సిద్దిపేటకు మంజూరైన ఔటర్ రింగ్‌రోడ్డు, బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల, శిల్పారామం, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ పాఠశాల, స్పోర్ట్స్ స్టేడియం, ఆడిటోరియం తదితర పనులకు సంబంధించిన సుమారు రూ.1,070 కోట్ల నిధులను నిలిపివేశారని హరీశ్‌రావు ఆరోపించారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను పూర్తి చేయకుండా నిలిపివేయడం సరికాదన్నారు. సిద్దిపేటకు మంజూరైన వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు తరలించారని, ఆ కళాశాలను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. 87 నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు మంజూరు చేసి సిద్దిపేటకు ఇవ్వకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు.
సాగునీటి పనులు పూర్తి చేయాలి
మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ ప్రాజెక్టుల కింద కాలువల నిర్మాణాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. మిరుదొడ్డి మండలానికి ఉపయోగపడే ఇర్కోడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 95 శాతం పూర్తయినా మిగిలిన పనులు చేపట్టడం లేదన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్‌లో నీటిని నింపినా కాలువలు, మరమ్మతులు పూర్తి చేయకపోవడంతో హుస్నాబాద్ ప్రాంతానికి సాగునీరు అందడం లేదని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి వరకు నీటిని తరలించే పనులు, కొండపోచమ్మ కాలువల పనులను కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
మల్లన్నసాగర్ నిర్వాసితుల్లో 90 శాతం మందికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం న్యాయం చేసిందని, మిగిలిన వారికి కోర్టు ఆదేశాల నేపథ్యంలో పరిహారం నిలిచిపోయిందని తెలిపారు. ప్రస్తుతం అడ్డంకులు తొలగినా పరిహారం ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని కోరారు.
ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యం
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచాలని, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల చదువులు, ఉద్యోగావకాశాలపై ప్రభావం పడుతోందన్నారు.
వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు నిలిచిపోయాయని, 50 పడకల ఆయుష్ ఆసుపత్రిని ప్రారంభించి ఏడాది గడిచినా వైద్య సేవలు అందుబాటులోకి రాలేదన్నారు. సిద్దిపేట రింగ్‌రోడ్డు పనులు 90 శాతం పూర్తయినా మిగిలిన పనులను పూర్తి చేయడం లేదని విమర్శించారు. నర్సింగ్ కళాశాల భవనం, శిల్పారామం, రంగనాయకసాగర్ పర్యాటక ప్రాజెక్టు, మల్టీపర్పస్ ఆడిటోరియం, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, పోలీస్‌స్టేషన్ భవనాల నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని కోరారు.
నా మీద కక్షను ప్రజలపై చూపొద్దు
తనపై ఉన్న రాజకీయ కక్షను సిద్దిపేట ప్రజలపై చూపవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట ప్రజలు ప్రత్యేక ప్రాధాన్యత కోరుకోవడం లేదని, ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులను పూర్తి చేసి, నిలిపివేసిన నిధులను విడుదల చేయాలని మాత్రమే కోరుతున్నారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్దిపేట పర్యటనలో ప్రజలకు ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలని, రైతు రుణమాఫీ, రైతుభరోసా, సాగునీటి ప్రాజెక్టులు, నిర్వాసితుల పరిహారం, పెండింగ్ అభివృద్ధి పనులపై కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడకుండా, ఇచ్చిన మాట నిలబెట్టుకొని సీఎం పదవి గౌరవాన్ని కాపాడుకోవాలని హరీశ్‌రావు అన్నారు.