సిద్దిపేటలో లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు ప్రొసీడింగ్స్ అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
సిద్దిపేట అర్బన్, : ఏళ్ల తరబడి కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో కొత్త పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నిమ్రా గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కె. హైమావతితో కలిసి సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన 2,477 మంది లబ్ధిదారులకు కొత్త చేయూత పింఛన్ల మంజూరు ప్రొసీడింగ్స్ అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి కొత్త పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. నిధులు లేకుండా కొత్త పింఛన్లు ఎలా ఇస్తారని కొందరు విమర్శించినప్పటికీ, అర్హులైన పేదలకు చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పించడం సంతోషంగా ఉందన్నారు.
సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా
ప్రజా పాలన ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టగా, సిద్దిపేట జిల్లాలో 12 వేల ఇళ్లు మంజూరు చేశామని, ఇప్పటికే 70 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దీపావళి సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకున్నామని తెలిపారు.200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు సుమారు రూ.1,200 వరకు ఆదా అవుతోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, ఈ పథకం అమలుకు మూడేళ్లలో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.12 వేల కోట్లు అందించిందని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించామని, దీని ద్వారా సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. పేదలకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, కొత్త రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని పేర్కొన్నారు. సిద్దిపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
19న సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి
ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా కేంద్రంలో పర్యటించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఐదు లక్షల ఇందిరమ్మ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే కుటుంబ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం నిరంతరం అమలు చేస్తోందన్నారు.
12 వేల దరఖాస్తుల పరిశీలన.. 11,300 మందికి పింఛన్లు
జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్వీకరించిన 12 వేల దరఖాస్తులను పరిశీలించి, జిల్లా వ్యాప్తంగా 11,300 మంది చేయూత పింఛన్ లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, సాగునీటి లభ్యతను బట్టి రబీ సీజన్లో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 420 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ.. పేదలను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం కొత్త పింఛన్లతో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందడం ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక భరోసా ఏర్పడుతుందని పేర్కొన్నారు.
సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, కలెక్టర్
అనంతరం ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభ ప్రాంగణాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కె. హైమావతి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సభకు హాజరయ్యే ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్, సభా వేదిక, వివిధ వర్గాల ప్రజలు కూర్చునేందుకు గ్యాలరీలు, ఇతర మౌలిక సదుపాయాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, వేముల వీరేశం, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ధరిపెల్లి చంద్రం, సిద్దిపేట ఆర్డీవో సదానందం, నంగనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, చిన్నకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్, ఆత్మ చైర్మన్ పూజల గోపికృష్ణ, ఆర్టీఓ కమిటీ సభ్యుడు సూర్యవర్మ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.